ఇరాన్ అల్లర్లకు ట్రంపే కారణం
సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలకు, ప్రాణ నష్టానికి ట్రంప్‌నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన్ను ఒక ‘నేరస్థుడిగా’ ఇరాన్ పరిగణిస్తోందని ప్రకటించారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలకు, ప్రాణ నష్టానికి ట్రంప్‌నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన్ను ఒక ‘నేరస్థుడిగా’ ఇరాన్ పరిగణిస్తోందని ప్రకటించారు. శనివారం ప్రభుత్వ టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖమేనీ, దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై తొలిసారి నోరు విప్పారు.
అమెరికా ప్లాన్.. గ్యాంగ్‌స్టర్ల అమలు
ఇరాన్‌ను అణచివేయడానికి, ఇక్కడి వనరులపై ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఒక పెద్ద కుట్ర పన్నిందని ఖమేనీ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమెరికా అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగి, నిరసనకారులకు సైనిక మద్దతు ఇస్తామని ప్రకటనలు చేయడం ద్వారా వారిని రెచ్చగొట్టారని మండిపడ్డారు. నిరసనకారులు విదేశాల నుంచి వచ్చిన మందుగుండు సామగ్రిని వాడారని, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. వీరంతా అమెరికా కోసం పనిచేస్తున్న ‘కాల్‌బంట్లు’ అని అభివర్ణించారు.
వేలాది మంది మృతి.. తొలిసారి అంగీకారం
ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఖమేనీ మొదటిసారి బహిరంగంగా అంగీకరించారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ హింసలో సుమారు 3,000 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. నిరసనల్లో పాల్గొన్న దాదాపు 800 మందికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షలు అమలు చేయబోతోందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గి ఆ శిక్షలను నిలిపివేసినట్లు ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
నేరస్థులను విడిచిపెట్టం
దేశాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లాలనే ఆలోచన తమకు లేదని, కానీ శాంతికి విఘాతం కలిగించిన వారిని వదిలిపెట్టబోమని ఖమేనీ స్పష్టం చేశారు. నిరసనల ముసుగులో దేశాన్ని అస్థిరపరిచిన స్వదేశీ, విదేశీ నేరస్థులెవరినీ విడిచిపెట్టమని.. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇరాన్ జాతి ఈ కుట్రను విజయవంతంగా అణచివేసిందని అయతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
మళ్లీ మొదలైన దౌత్య యుద్ధం
కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో ఖమేనీ తాజా వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మళ్లీ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం వేస్తున్న ఆర్థిక అస్త్రాలు (సుంకాలు), ఇరాన్ చేస్తున్న ఆరోపణలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.



