నెతన్యాహుతో పుతిన్ కీలక చర్చలు
మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న రష్యా అధ్యక్షుడు
ఇరాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
విశ్వంభర బ్యూరో: ఇరాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ వేదికగా సాగుతున్న అంతర్గత అల్లర్లు, ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌తో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు, అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని నెతన్యాహుకు పుతిన్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి రష్యా తరపున దౌత్యపరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచ శాంతికి కీలకమని పుతిన్ అభిప్రాయపడ్డారు.
రక్తసిక్తమవుతున్న ఇరాన్ వీధులు
మరోవైపు, తీవ్ర ఆర్థిక సంక్షోభం ఇరాన్‌ను కుదిపేస్తోంది. గత కొన్ని వారాలుగా నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగంపై అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఈ నిరసనలను అణచివేసేందుకు భద్రతా బలగాలు ప్రయోగించిన బలప్రయోగం తీవ్ర హింసకు దారితీసింది.
అమెరికాకు చెందిన 'హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ' (HRNA) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 3,000 మందికి పైగా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలుస్తోంది. వేలాది మంది గాయపడగా, వందల సంఖ్యలో నిరసనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. రష్యా జోక్యంతోనైనా అక్కడి పరిస్థితులు సద్దుమణుగుతాయా లేదా అనేది వేచి చూడాలి.



