మున్సిపల్ నగారా.. ఎస్ఈసీ దూకుడు!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తన కసరత్తును ముమ్మరం చేసింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తన కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లాల వారీగా ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆమె వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అడ్డంకులను తొలగించేందుకు ఎస్ఈసీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుంది. తాజాగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో రాణి కుముదిని సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితా స్థితిగతులు, పోలింగ్ కేంద్రాల మౌలిక వసతులపై ఆరా తీశారు.

Read More V3న్యూస్ ఛానల్ - విశ్వంభర దినపత్రిక  2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ--  ఆవిష్కారించిన సహకార సంఘం చైర్మన్ గోనె సరితా ప్రతాప్ రెడ్డి 

రేపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ సమావేశం కానున్నారు. ఈ జిల్లాల్లోని మున్సిపాలిటీల భౌగోళిక పరిస్థితులు, రాజకీయ సున్నితత్వం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. మూడో రోజు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లతో షెడ్యూల్ ఖరారైంది. దీంతో రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల సమీక్షా ప్రక్రియ పూర్తవుతుంది.

ఫోకస్ అంతా ఓటరు జాబితా పైనే..
ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటరు జాబితాల రూపకల్పనపై ఎస్ఈసీ గట్టిగా దృష్టి పెట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, డూప్లికేట్ ఓట్లు లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఓటర్లకు దూరం భారం లేకుండా చూడాలని, దివ్యాంగులకు అవసరమైన ర్యాంపుల ఏర్పాటుపై ప్రత్యేక నివేదికలు కోరారు.

ఎన్నికల కోడ్, శాంతిభద్రతలు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే అమలులోకి వచ్చే ఎన్నికల కోడ్ పై ముందస్తు అవగాహన కల్పించాలని రాణి కుముదిని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది గుర్తింపు, వారికి శిక్షణ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ అదనపు బలగాల మోహరింపుపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శక పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు 'పర్‌ఫెక్ట్ గైడ్‌లైన్స్' పాటించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.