వాహనంతో వెనుక నుంచి గుద్ది.. తాడును మెడకు బిగించి.. ఆపై పెట్రోల్ పోసి..

వాహనంతో వెనుక నుంచి గుద్ది.. తాడును మెడకు బిగించి.. ఆపై పెట్రోల్ పోసి..

తమ్ముడి మరణానికి అన్న ప్రతీకారం తీర్చుకున్నాడు. సరిగ్గా ఏడాదిలోనే తన తోబుట్టువును హత్య చేసిన యువకుడిని అతి దారుణంగా చంపేశాడు. ఈ ప్రతీకార హత్య సూర్యాపేట జిల్లాలో జరిగింది. 

విశ్వంభర, నల్లగొండ బ్యూరో: సరిగ్గా ఏడాది క్రితం హత్య కేసులో నిందితుడైన యువకుడిని సరిగ్గా అదే నెలలో ప్లాన్ చేసి పక్కాగా హత్య చేశారు. వాహనంతో వెనుక నుంచి గుద్ది బలవంతంగా కారులోకి ఎక్కించుకుని దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆపై తాడును మెడకు బిగించి చంపేశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చివరికి కటకటలాపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన నందికొండ వెంకన్న(26) ఈనెల 23న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతడి ఆచూకీ గురించి వెతకగా, అతడి మోటారు సైకిల్ రాయిన్‌గూడెం గ్రామం పరిధిలో దొరికింది. దీంతో వెంకన్న తండ్రి నందికొండ సైదులు సూర్యాపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.  దర్యాప్తులో భాగంగా మూడు టీమ్‌లను రంగంలోకి దించి కేసును ఛేదించారు. సదరు యువకుడు నందికొండ వెంకన్న హత్యకు గురయినట్టుగా పోలీసులు తెల్చారు. అసలు విషయంలోకి వెళితే.. 

హత్య జరగడానికి కారణం హత్యే..

Read More సాంస్కృతిక కార్యక్రమాలకు గట్టిప్పలపల్లి విద్యార్థులు

నందికొండ వెంకన్న 2022 సంవత్సరంలో తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్‌ను డబ్బు వివాదం విషయంలో హత్య చేశారు. ఈ విషయంలో కట్టంగూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.  అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకన్న తనకు బెజవాడ రాజశేఖర్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ ఉందని టేకుమట్ల గ్రామంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రాజశేఖర్ హత్యకు ప్రతీకారంగా రాజశేఖర్ సొంత అన్న బెజవాడ రమేశ్ ప్లాన్ చేశారు. దీంతో నందికొండ వెంకన్న మరో స్నేహితుడు ఖమ్మంపాటి సైదులుతో కలిసి టేకుమట్ల గ్రామంలో ఉంటున్న వెంకన్నను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. కానీ సాధ్యం కాలేదు. 

తమ్ముడిని చంపిన సరిగ్గా ఏడాదికి.. 
తన సోదరుడు బెజవాడ రాజశేఖర్‌ను మే 2022లో చంపారని, అదే నెలలో ఎలాగైన హత్య చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 21న బెజవాడ రమేశ్, ఖమ్మంపాటి సైదులు రెక్కీ నిర్వహించి వెళ్లారు. అనంతరం ఈనెల 23న నందికొండ వెంకన్నను ఎలాగైనా చంపాలని బెజవాడ రమేశ్, ఖమ్మంపాటి సైదులులు కలిసి బెజవాడ రాజశేఖర్ సొంత బాబాయి బెజవాడ జానయ్య, బోడ సతీష్ కుమార్, ఇస్లావత్ సురేశ్‌కు విషయం చెప్పారు. దీంతో వారు సరేనని చెప్పడంతో ఉదయం 8.15 గంటల సమయంలో టేకుమట్ల క్రాస్ రోడ్డు వద్ద బెజవాడ జానయ్య, ఇస్లావత్ సురేశ్‌లు నందికొండ వెంకన్న కోసం ఎదురుచూశారు. ఆ సమయంలో నందికొండ వెంకన్న యాక్టివా వాహనంపై సూర్యాపేటకు వెళుతుండగా, వెనుక నుంచి ఫాలో అయ్యి రాజుగారి తోట హోటల్ వద్ద ఎదురుగా వచ్చి మహేంద్ర వాహనంతో ఖమ్మంపాటి సైదులు ఢీకొట్టాడు. దీంతో వెంకన్న రోడ్డు పక్కన పడిపోయాడు. వెంటనే వెంకన్నను బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని మోతే గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ వెంకన్న మెడకు తాడును బిగించి చంపేశారు. అక్కడే ఉన్న కర్రలను శవంపై వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.ఈ కేసును ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ వై.సురేందర్ రెడ్డి, ఎస్ఐ ఎన్.బాలునాయక్, సిబ్బందిని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు.

Related Posts