హైడ్రా చర్యలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం
విశ్వంభర, సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేత చర్యలను, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్‌కు చెందిన పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ భూమి పేరుతో కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ఆ స్థలం 1954 నుంచే తమ పూర్వీకుల సొంతమని, భూ భారతి పోర్టల్ సహా అవసరమైన పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని విమర్శించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.మాణిక్ యాదవ్ కారును ధ్వంసం చేయడం, సిద్దు జీవనాధారమైన ఆర్వో ప్లాంట్‌ను కూల్చివేయడం ఖండనీయమని పేర్కొన్నారు. అదే సర్వే నంబర్‌లోని కొన్ని నిర్మాణాలను వదిలిపెట్టడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సూచిస్తోందన్నారు. హైడ్రా చర్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములను స్పష్టంగా గుర్తించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో తుంట అంజయ్య యాదవ్, బాల్ రెడ్డి, కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, నర్సింహ, అప్పల భాస్కర్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, బిజిలిపురం రాజు, పెద్ద రాజు, శివ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



