తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిటీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందనే వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందనే వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ దర్యాప్తును కొనసాగించవచ్చని, ఇది గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవైపు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
ఛార్జ్‌షీట్‌లో వెలుగు చూసిన కల్తీ నిజాలు
సీబీఐ నేతృత్వంలోని సిట్ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో లడ్డూ తయారీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఆధారాలు లేవని సిట్ పేర్కొన్నప్పటికీ, భారీ స్థాయిలో కల్తీ జరిగినట్లు నిర్ధారించింది. స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా సింథటిక్ నెయ్యి, పామాయిల్ వంటి చౌకబారు పదార్థాలను వాడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమాలకు బాధ్యులైన వారిని గుర్తించి, తదుపరి చర్యలు తీసుకోవడం కోసమే ఏకసభ్య కమిటీని నియమించినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, ప్రభుత్వ కమిటీ విచారణకు కోర్టు అనుమతిని ఇచ్చింది.
రాజకీయంగా మారిన లడ్డూ వివాదం
ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే సిట్ విచారణ ముగిసిన తరుణంలో మరో కమిటీని ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అతిక్రమించడమేనని పిటిషనర్ వాదించారు. అయితే, సిట్ నివేదిక ఆధారంగా తదుపరి పరిపాలనాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ తీర్పుతో తిరుమల లడ్డూ కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే దిశగా ఏకసభ్య కమిటీ తన దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.



