పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అంతు చిక్కని ప్రశ్నలు.. సమగ్ర విచారణకు ఆదేశం
పోలింగ్ రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఘటనలపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, హత్యాయత్నం ఘటనపై సిట్ అధికారులు విచారణ పూర్తి చేశారు. ఈ కేసు విచారణ కోసం సిట్ డీఎస్పీ రవి మనోహర్ చారి ఆధ్వర్యంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.
మొదట ఎస్వీయూనివర్సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కేసులు వివరాలపై ఆరా తీశారు. అంతేకాదు ఎఫ్ఐఆర్ లను పరిశీలించారు. తర్వాత పద్మావతి యూనివర్సిటీ వద్ద చెలరేగిన అల్లర్ల వివరాలను సేకరించారు. విద్యార్థులను, చుట్టపక్కల వారిని అల్లర్లపై ప్రశ్నించారు. అంతేకాదు.. స్థానికంగా నమోదైన ఎఫ్ఐఆర్‌ను పరిశీలించారు.
ఆ తర్వాత పులివర్తి నానిపై జరిగిన దాడి ప్రాంతానికి వెళ్లి.. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక నియోజకవర్గంలోని ఎక్కువ అల్లర్లు జరిగిన కూచువారిపల్లి, రాంరెడ్డిగారిపల్లికి వెళ్లి విచారణ చేపట్టారు. రాంరెడ్డిగారిపల్లిలో ఈ అల్లర్లలో ఓ ఇళ్లు దగ్థమైంది. ఈ ఇల్లు ఎవరికి, ఎవరు దాడి చేశారనే వివరాలను సేకరించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్ మెన్ ఇంటి కూడా వెళ్లారు. అక్కడ జరిగిన ఘటనలపైనా ఆరా తీశారు. చుట్టపక్కల ఉన్న సీసీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఇంకా బయటకు రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే.. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మొత్తం ఈ అల్లర్లలో కేసుల నమోదైన వారి వివరాలు, వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. వారి కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.