నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
విశ్వంభర బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కు మత తొమ్మిదవ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవాన్ని (షాహీదీ దివస్) పురస్కరించుకుని నిర్వహిస్తున్న భారీ ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గురుద్వారాలో ఆధ్యాత్మిక అనుభూతి
గురుద్వారాకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు సిక్కు మత పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సచ్‌ఖండ్ గురుద్వారా లోపల ఆయన మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు గురువులు ఆయనకు సిక్కు సంప్రదాయ వస్త్రాలను బహూకరించి ఆశీర్వచనాలు అందజేశారు. మానవత్వం, ధర్మ పరిరక్షణ కోసం గురు తేగ్ బహదూర్ చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మం, మానవ హక్కుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన గురువుల ఆశీస్సులు తీసుకోవడం అదృష్టమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రాజకీయ దిగ్గజాల సమక్షంలో..
నాందేడ్ చేరుకున్న పవన్ కల్యాణ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఘనస్వాగతం పలికింది. ఈ పర్యటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్, భోకర్ ఎమ్మెల్యే శ్రీజయ చవాన్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేడుక కోసం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు నాందేడ్ చేరుకున్నారు.



