‘ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నా’... నటుడు నరేశ్ ట్వీట్ వైరల్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు నరేశ్ తాజాగా ఎక్స్(X) వేదికగా స్పందించారు.
తాను ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో ఎన్నికల పోరు ముగిసిందనీ.. ఓటర్లు తమ తీర్పు ఇచ్చారని అన్నారు. అయితే, ప్రజలకు అత్యంత ఇష్టమైన నాయకులు గెలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు తొలిగిపోయి శాంతి నెలకొనాలని కోరుకుంటున్నా అని నరేశ్ ట్వీట్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నరేశ్ పలు సందర్భాల్లో కూటమికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరుగుతుందని గతంలో నరేశ్ ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అప్పుడు నరేశ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.