కాకినాడకు భారీ పెట్టుబడులు
8వేల మందికి ఉపాధి అవకాశం
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ప్రముఖ ఇంధన సంస్థ ‘ఏఎం గ్రీన్’ కాకినాడలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్ నుంచి దేశంలోనే తొలిసారిగా గ్రీన్ అమ్మోనియాను అంతర్జాతీయ విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.జర్మనీ, సింగపూర్, జపాన్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సుమారు 8,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
2030 నాటికి ఉత్పత్తి ప్రారంభం
పర్యావరణ హితమైన ఇంధన వనరుల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది. ఈ ప్రాజెక్టును సత్వరం పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేశ్ తెలిపారు. 2030 నాటికి ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తాం" అని లోకేశ్ తన పోస్టులో ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని సూచించారు.



