పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!
విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో తాను ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్లాలని తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం నుంచి విడుదలయ్యే నీటిని నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధానంతో ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మిగిలే నీటిని తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడంలో విజయవంతమయ్యామని చంద్రబాబు అన్నారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనుకూలమైన ఫలితాలను తీసుకొచ్చిందని, గతంలో దెబ్బతిన్న పాలనా వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అభివృద్ధికి వేగం వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా మరింత కష్టపడి పనిచేయాలని మంత్రులు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన ప్రజల వివరాలను కూడా ఆయన ప్రస్తావించారు.
రాజధాని అమరావతిని గతంలో కొందరు శ్మశానం, ఎడారిగా విమర్శించారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అది దేశానికే స్ఫూర్తినిచ్చే అభివృద్ధి ప్రాజెక్టుగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మారుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేని స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని పేర్కొంటూ, రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.



