పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు

క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్: పవన్ కళ్యాణ్

పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు

పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

విశ్వంభర, ఏపీ బ్యూరో: పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు.

రాష్ట్ర అభివృద్ధిలో ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’ ఒక గేమ్ ఛేంజర్ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చిందని, తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రధాని మోదీ సహకారం, చంద్రబాబు నాయకత్వంలో ఏపీని గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామన్నారు.

Read More Pawan Kalyan: కులాల చిచ్చు సహించం..!!

ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి లభించనుందని పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.  నిర్మాణ దశలో 8,000 మందికి, నిర్వహణ దశలో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనుబంధ రంగాల ద్వారా మరో కొన్ని వేల మందికి దీర్ఘకాలిక ఉపాధి లభించనుంది. బలమైన సంకల్పంతో ఈ స్థాయికి ఎదిగిన గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్, మహేష్‌లను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి, స్వరాష్ట్రంలో ఇలాంటి భారీ ప్రాజెక్టును చేపట్టడం గర్వకారణమని కొనియాడారు.

ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ విశేషాలు
కాకినాడలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో అత్యంత కీలకం కానుంది. 495 ఎకరాల విస్తీర్ణంలో, ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. రూ.15,600 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మొదలై, భవిష్యత్తులో 8 బిలియన్ డాలర్ల వరకు విస్తరించనుంది. 2027 చివరి నాటికి తొలి దశ కమిషనింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags: AP kakinada