జడ్పీహెచ్ స్కూల్ స్థలాన్ని రక్షించాలి
- టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్
విశ్వంభర, సంగారెడ్డి: 13 దశాబ్దాల చరిత్ర కలిగిన పటాన్‌చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆస్తులను, భవనాలను రక్షించాలని కోరుతూ 1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టెలికం బోర్డు మెంబర్, పూర్వ విద్యార్థి బైండ్ల కుమార్ మాట్లాడుతూ, పాఠశాల భవనాలను అర్ధరాత్రి వేళ దొంగచాటుగా కూల్చివేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా నిలయాలను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. తక్షణమే పాఠశాల స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, అదే స్థలంలో తిరిగి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పాఠశాల స్థలాన్ని కాపాడతామని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన వికాస సమితి అధ్యక్షులు బొడ్డు విజయకుమార్, షణ్ముఖ, 1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పులి విష్ణు, బొమ్మ ప్రభు, గడ్డమీది బాల కుమార్, కొమరగూడెం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



