పండిన ప్రతి గింజనూ కొనాల్సిందే
: సదాశివపేట కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
విశ్వంభర, సదాశివపేట్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. హరీశ్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని తన దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగిందని చెప్పారు. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోంది. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు? , రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయి. వెంటనే రూ. 5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. లేదంటే రైతులు బయట అమ్ముకుని క్వింటాల్ కు రూ. 1000 చొప్పున, ఎకరానికి పది వేల రూపాయలు నష్టపోతారు.రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే, సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని చెబుతున్నారు. మద్దతు ధర రూ. 2400 ఉంటే రూ. 1600-1700 కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.



