కళలు వికసిస్తేనే సంస్కృతి పరిమళిస్తుంది
- : ప్రముఖ సినీ దర్శకుడు బి. నర్సింగ్ రావు
విశ్వంభర, బషీర్ బాగ్: బాల ప్రతిభాశాలి రిక్కీ తేజ్ రూపొందించిన చార్కోల్ స్టోరీస్ కళా ప్రదర్శనను హైదరాబాద్‌లోని లమాకాన్ వేదికగా ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బి. నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్కీ తేజ్‌లోని అసాధారణ ప్రతిభను కొనియాడుతూ ముఖ్యంగా పౌరాణిక అంశాలపై అతను చూపిస్తున్న సహజసిద్ధమైన, జీవంతో నిండిన చార్కోల్ చిత్రాలను ప్రశంసించారు. భవిష్యత్తులో అతను గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు నృత్యం, మట్టి కళలు, సంగీతం, క్రీడలు, ఇతర సృజనాత్మక, సహపాఠ్య కార్యకలాపాలను అభ్యసించాలని సూచించారు. తెలంగాణను కళల పుట్టినిల్లు అని పేర్కొంటూ, ఇలాంటి ప్రతిభను ప్రోత్సహించడంలో రాష్ట్రం ముందుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పిల్లలు స్వేచ్ఛగా తమ సృజనాత్మకతను వ్యక్తపరచుకునేలా అవకాశం ఇవ్వాలని, అలా చేస్తేనే వారు కళల్లో రాణిస్తారని తెలిపారు. కళలు వికసిస్తే సంస్కృతి వికసిస్తుందని, కళలను సాధించడం మాత్రమే కాక వాటిని ఆస్వాదించడం కూడా ఒక కళేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావు, తెలంగాణ టుడే సంపాదకీయ కార్టూనిస్ట్ నర్సింహా, సాహితి, వేముల సైదులు, కట్టా కోటేశ్వరరావు, రాజ్యలత, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.



