స్వీయ గణన పై విస్తృత సమావేశం
విశ్వంభర, వలిగొండ: జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన పై విస్తృత అవగాహన కల్పించేందుకు వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2027 జనగణన ప్రక్రియలో స్వీయ గణన విధానం అత్యంత కీలకమని, ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను సరైన విధంగా నమోదు చేసుకోవడం ద్వారా ఖచ్చితమైన గణాంకాలు సేకరించబడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన మండల తహసీల్దార్ శ్రీ దశరథ నాయక్, మాట్లాడుతూ, జనగణనలో పొందిన సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు మూలస్తంభమని, ప్రతి కుటుంబం తమ వివరాలను సమగ్రంగా అందించాలని సూచించారు. మండల పంచాయతీ అధికారి శ్రీమతి వై. ప్రేమలత గారు గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీలు ప్రజలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని, అవసరమైన సహాయాన్ని అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని పంచాయతీ సెక్రటరీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొని స్వీయ గణన ప్రక్రియపై వివరణాత్మక చర్చ జరిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.



