కొమరబండలో ఘనంగా ‘జల అర్పణ దివస్’
విశ్వంభర, షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ‘జల అర్పణ దివస్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొని గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి కె. పద్మ గోపాల్ ముదిరాజ్, ఉప సర్పంచ్ ఎన్. శేఖర్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో అధికారులు మిషన్ భగీరథ నీటి విశిష్టతను వివరించారు. ప్యాకేజ్డ్ వాటర్ కంటే భగీరథ నీరు మిన్న: బయట మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ నీటిలో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు తగ్గిపోతాయని, కానీ మిషన్ భగీరథ నీటిని శాస్త్రీయంగా శుద్ధి చేసి అవసరమైన పోషకాలు నిల్వ ఉండేలా అందిస్తున్నామని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ఆరోగ్యానికి భరోసా: భగీరథ నీరు తాగడం వల్ల ఎముకల దృఢత్వం పెరగడంతో పాటు కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చని అధికారులు వివరించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు లక్ష్యం: ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథను అమలు చేస్తోందని, గ్రామ ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ కె. పద్మ గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికీ భగీరథ నీరు అందుతుండటం ఆనందకరమని, ప్రజలందరూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నీటినే వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఉన్నతాధికారులు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు



