ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారం చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 విశ్వంభర, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో ప్రజల సమస్యలను ప్రణాళికాబద్ధంగా గుర్తించి సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం స్థానిక రవి మహాల్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అధ్యక్షతన నిర్వహించిన పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026-27 ముసాయిదా బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్డు స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడం మున్సిపల్ పాలక మండలి ప్రధాన బాధ్యత అని తెలిపారు. నూతన పాలక మండలి తొలి సమావేశంలోనే రూ.107.30 లక్షల బడ్జెట్ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించి పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు, తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.మహిళల భద్రత, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన ఆయన, మున్సిపాలిటీకి రావలసిన ఇంటి పన్ను, నల్లా బిల్లులు, ఇతర బకాయిల వసూళ్లలో ప్రజలను చైతన్యపరచి సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ భవన నిర్మాణాలను అరికట్టి మున్సిపాలిటీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.అదేవిధంగా మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడంపై దృష్టి సారించి, గతంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట మున్సిపాలిటీ సాధించిన గుర్తింపును తిరిగి సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్‌పర్సన్ ఎం.డి. షఫీ ఉల్లా, కమీషనర్ సి.హెచ్. హన్మంతరెడ్డి, మున్సిపల్ పాలక మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Tags: