2,500 మంది కళాకారులతో 'వందేమాతరం'.. నాకెంతో గర్వకారణం: కీరవాణి
జనవరి 26న హైదరాబాద్ లో ప్రదర్శన
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవాత్మక స్ఫూర్తిని రగిలించిన ‘వందేమాతరం’ గేయానికి ఆయన స్వరకల్పన చేయడమే కాకుండా, భారీ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవాత్మక స్ఫూర్తిని రగిలించిన ‘వందేమాతరం’ గేయానికి ఆయన స్వరకల్పన చేయడమే కాకుండా, భారీ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు. ఐకానిక్ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 2,500 మంది కళాకారులతో కలిసి కీరవాణి ఈ గేయాన్ని ఆలపించనున్నారు.
బంకించంద్ర ఛటర్జీ 1885లో రచించిన ఈ గేయం, గతేడాది నవంబర్ 7వ తేదీతో 150 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకునే ఈ బృహత్తర ప్రదర్శనను ప్రభుత్వం ప్లాన్ చేసింది. "వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2,500 మంది ఆర్టిస్టులతో కలిసి వేదికను పంచుకోవడం గర్వంగా ఉందని ఎం.ఎం.కీరవాణి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం కీరవాణి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'వారణాసి' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో కీరవాణి తన ప్రదర్శనతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.



