అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
నగరం నడిబొడ్డున విషాదం చోటుచేసుకుంది. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నగరం నడిబొడ్డున విషాదం చోటుచేసుకుంది. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24)గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో ఇలాంటి విషాదం నిండటంతో ఆ ప్రాంతమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. రామరాజు నివాసం నుంచి ఉదయం ఎంతసేపటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం కలిగింది. పిలిచినా పలకకపోవడంతో ఆందోళన చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ముగ్గురు విగతజీవులుగా పడిపోయి కనిపించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
రంగంలోకి క్లూస్ టీమ్
ఘటనపై సమాచారం అందిన వెంటనే అంబర్‌పేట్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరించారు. మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఆత్మహత్యలకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కారణమా? లేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఈ విపరీత నిర్ణయం తీసుకున్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



