విద్యా కమిషన్ నివేదికపై చర్చలు జరపాలి

విద్యా కమిషన్ నివేదికపై చర్చలు జరపాలి

విశ్వంభర, హిమాయత్‌నగర్‌ : తెలంగాణ విద్యా కమిషన్ రూపొందించిన సిఫార్సుల నివేదికపై విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావంతులతో ప్రభుత్వం విస్తృత చర్చలు జరపాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్.ఎ. స్టాలిన్ అన్నారు. హైదరాబాదు హిమాయత్‌నగర్‌లో సోమవారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యారంగం కేంద్రీకరణ, కార్పొరేటీకరణ దిశగా సాగుతోందని విమర్శించారు. ఉన్నత విద్యలో ఫీజులు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువు భారమవుతుందని పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. సమావేశానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్యార నరేష్, రెహమాన్, గ్యార క్రాంతి, సి. రాజు పాల్గొన్నారు.

Tags: