తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో కీలక మార్పు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో కీలక మార్పు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ద్వితీయ శ్రేణి వైద్య సేవలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో తీసుకున్న చర్యగా ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ మెట్రోను పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించడం రవాణా రంగంలో పెను మార్పులకు సంకేతంగా నిలిచింది.
అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు
వచ్చే నెల మార్చి 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉండగా, 17, 18 తేదీలలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే రంజాన్ పండుగ రావడం, అంతకు ముందు రోజే ఉగాది ఉండటంతో పండుగ వాతావరణంలోనే సభ సాగనుంది.
విద్యా, ధార్మిక రంగాలకు భూ కేటాయింపులు
కేబినెట్ నిర్ణయాలలో భూ కేటాయింపులకు పెద్దపీట వేశారు. భక్తుల సౌకర్యార్థం ఖమ్మం జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 20 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరు ప్రాంతంలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి 70 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల మారుమూల ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



