విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి
విశ్వంభర, భువనగిరి : విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో భువనగిరిలో మహా ధర్నా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భువనగిరి బాయ్స్ ప్రభుత్వ కళాశాల నుంచి ర్యాలీగా వచ్చి రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన సుమారు 9 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని విమర్శించారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా విగ్రహాలు, ఇతర ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. రానున్న బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలన్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ ఛార్జీలను పెంచాలని, విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన శంకర్, నాయకులు వేముల అనిల్, ఉడతల సాయి, ఎడ్ల మహాలింగం, దీపక్, ఉదయ్, ఆర్యన్, మానస, ఉదయ్ శ్రీ, రమాదేవి, వినూత్న, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.



