వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్‌

వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్‌

  •  ‘టాస్క్‌’ రౌండ్ టేబుల్‌లో విమర్శలు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి:  రాష్ట్ర బడ్జెట్‌ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని వక్తలు విమర్శించారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్‌) ఆధ్వర్యంలో హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ‘తెలంగాణ బడ్జెట్‌ 2026- భవిష్యత్తు ఆకాంక్షలు’ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం వడ్డీలు, ఈఎంఐల రూపంలో భారీ భారం మోయాల్సి వస్తోందన్నారు. ఎన్నికల హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్షం బడ్జెట్‌పై నిర్మాణాత్మక చర్చ చేయడం లేదని విమర్శించారు. కౌలు రైతుల అంశంపై స్పష్టత అవసరమన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ బడ్జెట్‌లో అంకెల గారడీ ఉందని ఆరోపించారు. లోటు బడ్జెట్‌ పెరిగిందని, అప్పులపై ఆధారపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాలేదని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాష్ట్రం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సమస్యలు, ఉద్యోగాల అంశాల్లో పురోగతి కనిపించలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బడ్జెట్‌ ప్రతిపాదనలు శాస్త్రీయంగా ఉండాలని సూచించారు. ఎన్నికల మానిఫెస్టోకు ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. విద్యారంగానికి తగినంత నిధులు కేటాయించలేదని అభిప్రాయపడ్డారు. టాస్క్‌ కన్వీనర్ ఎర్రోజు శ్రీనివాస్ విద్యారంగానికి ప్రాధాన్యత పెంచాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సామాజిక సాధికారతకు కీలకమని పేర్కొన్నారు. ఉన్నత విద్య అందుబాటులో ఉండాలంటే నిధులు పెరగాలని అన్నారు. ఆర్థిక విశ్లేషకులు పాపారావు బడ్జెట్‌ను ‘భ్రమల బడ్జెట్‌’గా అభివర్ణించారు. ప్రతిపాదనలకు, వాస్తవ ఖర్చులకు మధ్య పెద్ద తేడా ఉందన్నారు. రైతు సమస్యల నిపుణుడు పులి రాజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు, పంట బీమా అవసరమన్నారు. ఆర్థిక శాఖ అధికారి సాయి ప్రసాద్ రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలు, పెన్షన్లకే వెళ్తోందని చెప్పారు. వనరుల సమీకరణ సవాలుగా మారిందన్నారు. ప్రొఫెసర్ సీతారామారావు విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశానికి హెచ్ రవీందర్‌, జి రూబీ స్టీవెన్ సన్, ఆసరి రాజు, సాజిదాఖాన్ తదితరులు హాజరయ్యారు.

Tags: