రైస్ మిల్ పొగతో ఇబ్బందులు

రైస్ మిల్ పొగతో ఇబ్బందులు

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామపంచాయతీ పరిధిలోని సాయి మహాలక్ష్మి రైస్ మిల్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, పంట పొలాల్లో దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో త్రాగునీరు కూడా కలుషితం అయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో సాయి మహాలక్ష్మి రైస్ మిల్‌పై పర్యావరణ పరిరక్షణ చట్టాలు, గాలి కాలుష్య నియంత్రణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు సంతకాలతో  వినతి పత్రాన్ని గ్రామ సర్పంచ్ చేపంగి ప్రవీణ్‌కు అందజేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోలిపేట అనంతరెడ్డి, సంగెం భాస్కర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ నాగుల సత్యనారాయణ, కుమ్మరిండ్ల శ్రీనివాస్, ఎలుకటి కృష్ణ, చేపంగి జంగయ్య, నందిగామ రవి, బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుకటి రఘుపతి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎలుకటి నరసింహ, బీజేపీ నుంచి వార్డు సభ్యుడు ఆవుల తరుణ్, మాజీ వార్డు సభ్యుడు బండ బిక్షపతి, లక్ష్మీపతి గౌడ్, పడకంటి శివ తదితరులు పాల్గొన్నారు.

Tags: