కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలి

కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలి

  •   కలెక్టర్ హైమావతి

విశ్వంభర, సిద్దిపేట: యాసంగి సీజన్ వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేయాలని  కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై ఆర్డీవోలు, సివిల్ సప్లై, మెప్మా, డీఆర్డీఏ, తహసీల్దార్లు, డీసీవో, డీఏఓ, డీఎం మార్కెటింగ్ తదితర అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో రబీ సీజన్‌లో అంచనాలకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందునా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. ప్రతీ మండలంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎం, మహిళా సమాఖ్య ఓపీవోలు, మార్కెటింగ్, అగ్రికల్చర్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని 421కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, తాలు తీసే యంత్రాలు, టార్పాలిన్ షీట్లు, బ్లోయర్లు, తాగునీటి సదుపాయం, టెంట్లు, విద్యుత్ కనెక్షన్, వెయింగ్ మిషన్లు, కార్మికులు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతీ కేంద్రాన్ని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని సివిల్ సప్లై, డీఎం సివిల్ సప్లై సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై తనూజ, డీఎం సివిల్ సప్లై అధికారి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: