నర్సింగ్ కాలేజీల్లో మిడ్‌వైఫరీ శిక్షణ

నర్సింగ్ కాలేజీల్లో మిడ్‌వైఫరీ శిక్షణ

  •  ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

విశ్వంభర, హైదరాబాదు :ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సిజేరియన్ డెలివరీలను తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బోయిగూడలో జరిగిన సేఫ్ మదర్ హుడ్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గర్భిణీలకు ఉచిత యాంటీనేటల్ పరీక్షలు, స్కానింగ్‌లు, పోషకాహారం, ఐఎఫ్ఏ మాత్రలు, కాల్షియం అందిస్తున్నట్లు తెలిపారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 102 వాహనాల ద్వారా ఉచిత రవాణా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సహజ ప్రసవాల ప్రోత్సాహానికి మిడ్‌వైఫరీ సేవలను బలోపేతం చేస్తూ ఇప్పటివరకు 370 మంది నర్సులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. “అనీమియా ముక్త భారత్”, “ఆరోగ్య మహిళ” కార్యక్రమాల ద్వారా మహిళల ఆరోగ్య సేవలను విస్తరించినట్లు పేర్కొన్నారు. బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగ బలోపేతానికి గత రెండు సంవత్సరాల్లో 10 వేలకుపైగా నియామకాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 2322 నర్సింగ్ పోస్టుల భర్తీ త్వరలో పూర్తవుతుందని పేర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, కోవిడ్ సమయంలో వారి సేవలు కీలకమని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చినట్లు వెల్లడించారు. గోషామహల్‌లో సుమారు రూ.3000 కోట్లతో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోందన్నారు. డాక్టర్ల ట్రాన్స్‌ఫర్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, జిల్లాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: