లింగ నిర్ధారణ పరీక్షలు శిక్షార్హం
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ కార్యక్రమాలలో భాగంగా, 3వ రోజు “సురక్షిత మాతృత్వ పద్ధతులు” పై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “సురక్షిత మాతృత్వ పద్ధతులు” సందేశాత్మక నాటిక ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. గర్భిణీ స్త్రీల పరీక్షల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవాలు, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే పీసీపీఎన్‌డీటీ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గర్భంలో శిశువు లింగ నిర్ధారణ నిషేధం దానికి సంబంధించిన శిక్షలను వివరించారు. శిశువుల సంరక్షణపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేసి, హాస్పిటల్ కి వచ్చు గర్భిణీ స్త్రీలకు సరిపడు కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం సంబంధిత అధికారులను కోరారు. అంతకుముందు “సురక్షిత మాతృత్వ పద్ధతులు” పై ఆరోగ్య సిబ్బంది నాటిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లి మరియు శిశువుల మరణాలను తగ్గించడం కోసం ముందస్తు గుర్తింపు, సమయానుకూల రిఫరల్ సేవలను మెరుగుపరచడం మరియు ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, సంతోషకరమైన కుటుంబం కోసం సురక్షిత మాతృత్వాన్ని ప్రోత్సహించడం. సుమారు 80 మంది వైద్య సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. వారిలో గర్భిణీ మహిళలు, ప్రసవానంతర మహిళలు మరియు వారి సహచరులు, వైద్యులు, ఆశా వర్కర్లు, నర్సింగ్ అధికారులు మరియు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల, సూర్యాపేట విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు సమాచారాత్మక పోస్టర్లను ప్రదర్శించి, గర్భిణీ స్త్రీల కోసం యాంటెనాటల్ కేర్ పై నాటికను ప్రదర్శించి అవగాహన కల్పించారు. నర్సింగ్ విద్యార్థులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడగా, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై ముఖ్యాంశాలు వివరించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ వెంకటరమణ, మెడికల్ సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రావణ్ కుమార్, డీసీహెచ్‌ఎస్ గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, పీవో ఎంహెచ్‌ఎన్ , సీడీపీఓ పాల్గొన్నారు.



