అసీఫ్ నెహర్ కాల్వలో గుర్రపుడెక్క తొలగించాలి

అసీఫ్ నెహర్ కాల్వలో గుర్రపుడెక్క తొలగించాలి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలో పారే అసీఫ్ నెహర్ కాల్వకు నీటిని నిలుపుదల చేసి విస్తృతంగా పెరిగిన గుర్రపు డెక్క ఆకును తొలగించి మండల పరిధిలోని మునిపంపుల గ్రామంలో శిథిలావస్థకు చేరిన కాల్వ కట్టను మరమ్మతు చేయాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. గ్రామ రైతులతో కలసి చిట్యాల నీటిపారుదల డిఇ కార్యాలయంలో సెక్షన్ అధికారి శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అసిఫ్ నెహర్ కాలువ గత పది సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రవహిస్తుండడంతో గుర్రపు డెక్క ఆకు ఏపుగా పెరిగి కాలువను మొత్తం ఆవరించి ప్రమాదకరంగా మారిందని, అధిక ప్రవాహం వచ్చినప్పుడల్లా నీరు కట్టను మించి ప్రవహించి పలుసార్లు కట్టలు కూడా తెగిన సందర్భాలు ఉన్నాయని, దీని మూలంగా తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. కాల్వ కట్టకింది పొలాలు జాలుబట్టి అరకపోవడంతో కనీసం కోత కోసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని, పై పొలాలు నీటిలో మునిగిపోయి ఏళ్ల తరబడి సాగుకు నోచుకోకుండా ఉంటున్నాయని, కట్టపై విస్తృతంగా కంప ఇతర చెట్లు మొలిచి అడ్డంగా పడి ఉన్నాయని కనీస పర్యవేక్షణ కరువైందని వాపోయారు. దశాబ్ద కాలంగా ఈ ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రైతులు ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని నీటిని ఒక నెలపాటు తగ్గించి గుర్రపు డెక్క ఆకును తొలగించి కాలువ కట్టను మరమ్మతులు చేయాలని తెలియజేశారు. నీటిపారుదల డిఇ సునీత నందను ఫోన్లో సంప్రదించగా త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, మాజీ ఉపసర్పంచ్ మామిడి పాండు రెడ్డి, గ్రామ రైతులు మన్నెం పద్మారెడ్డి, కల్లూరి రవి కుమార్, మేకల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: