ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
విశ్వంభర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ యూజీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. నీట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై ఐదు గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు రెండు మూడు గంటలు ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 3,334 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,227 పరీక్షకు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదనే నిబంధన ఉండడంతో విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్బంగా గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు సలహాలు అందజేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బద్ధోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సూచనలు సలహాలు అందజేశారు. అలాగే పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలను మూసి వేయించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా ఆయా పరీక్ష కేంద్రాల సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.



