ఆకట్టుకున్న నారసింహ వైభవం రూపకం
విశ్వంభర, హైదరాబాద్ : ప్రహ్లాద చరిత్రలో నరసింహుని అవతారం విశేషాలను భరతనాట్య రూపంలో నర్తకీమణులు రసరమ్యంగా ఆవిష్కరించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు. హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై భరతకళా క్షేత్రం నిర్వహణలో “కళా సమర్పాణమ్” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నాట్య గురువు వీణా గణేష్ అయ్యర్ శిష్యబృందంతో కలిసి “నారసింహ వైభవం” రూపకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో అష్టలక్ష్మీ స్తోత్రం, జతిస్వరాలు, అన్నమయ్య కీర్తన “అదిగో అల్లాడివో శ్రీ హరి వాసము” తదితర అంశాలను శిష్యబృందం కన్నులపండుగగా నర్తించి ఆకట్టుకున్నారు. సభా కార్యక్రమంలో ఆర్యసమాజ్ ప్రతినిధి ఆంజనేయులు మాట్లాడుతూ భారతీయ కళలు ప్రాచీనమైనవని, వాటిని తరతరాలకు అందించేందుకు కళాకారులు కృషి చేస్తున్నారని తెలిపారు. వేదికపై నాట్య గురువులు శిరీష, శ్రీదేవి పాల్గొని ప్రదర్శనను అభినందించారు



