ఎల్కేశ్వరంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు
- పశువుల మేతగా మారిన పంట. కన్నీరు పెట్టుకుంటున్న రైతులు
విశ్వంభర, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎల్క్వేశరం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రైతులు కష్టపడి పండించిన ధాన్యం సరైన రక్షణ లేకపోవడంతో పశువులకు మేతగా మారుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఎలాంటి కవర్లు, షెడ్లు లేకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల పశువులు స్వేచ్ఛగా తిరిగి ధాన్యాన్ని తింటున్నాయి. రైతులు తమ పంటను అమ్మేందుకు కేంద్రానికి తీసుకొచ్చినప్పటికీ, అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినా, ఎండ తీవ్రంగా ఉన్నా ధాన్యం రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం ఇలా పశువులకు ఆహారంగా మారడం బాధాకరం. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి, అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, కొనుగోలు కేంద్రంలో సరైన సదుపాయాలు కల్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు రాళ్ల బండి మల్లయ్య ,బక్కయ్య, సమ్మిరెడ్డి, సమ్మయ్య మరియు స్థానికులు కోరుతున్నారు



