వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఘనంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఘనంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు

విశ్వంభర హనుమకొండ జిల్లా:-వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ & గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి చాహత్ బాజ్ పాయి, NPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత శిఖరాలకు…ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కూడా ఈ కళాశాలకు చెందిన ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు. బీటెక్ చదివిన వారికంటే పాలిటెక్నిక్ చదివిన వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండి, త్వరగా ఉపాధి అవకాశాలు లభించి స్థిరపడతారని చెప్పారు.రూ.28 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి మళ్లీ పూర్వ విద్యార్థులందరూ రావాలని ఆకాంక్షించారు.తన కుటుంబానికి కూడా పాలిటెక్నిక్ విద్యతో అనుబంధం ఉందని, తన తండ్రి పాలిటెక్నిక్ చదివి ఉన్నత ఉద్యోగం సాధించారని, ఆ ప్రేరణతోనే తాను కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.స్కిల్ ఉంటే అవకాశాలు అపారం…NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, పాలిటెక్నిక్ విద్యకు గొప్ప ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లమా, ఇంజినీరింగ్ మధ్య తేడా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమని పేర్కొన్నారు. AI మనుషులను భర్తీ చేయదని, కొత్త సాంకేతికతలను నేర్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రత్యేకతపూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, ఈ కళాశాలలో చదవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ సమ్మేళనం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఉన్నత హోదాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులుచిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ నేడు సాంకేతిక విద్యలో విశిష్ట గుర్తింపు పొందింది. వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగి కళాశాలకు కీర్తి తెచ్చారు.బీహెచ్ఈఎల్, ఎచ్ఏఎల్, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎచ్సీఎల్, డీఆర్‌డీవో, ఇస్రో, ఐడీపీఎల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చరిత్ర , అభివృద్ధి పథంఈ కళాశాల ప్రారంభదశలో అజంజాహి మిల్లు ప్రాంగణంలోని ఒక షెడ్డులో 120 మంది విద్యార్థులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులతో ప్రారంభమైంది. 1955 జూలై 10న 16 ఎకరాల విస్తీర్ణంలో నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన జరిగింది.ప్రస్తుతం కళాశాలలో 1620 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 150 మంది అధ్యాపకులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. 1995-96లో ఈసీఈ, కంప్యూటర్ కోర్సులు ప్రారంభమై, తరువాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టబడ్డాయి.జ్ఞాపకాల సందడి…20 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి అల్లర్లు, గురువులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నేళ్ల తర్వాత స్నేహితులను కలవడం మరపురాని అనుభూతిగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో మళ్లీ కూర్చొని ఉత్సాహంగా గడిపారు. తమ కాలేజ్‌ను “అమ్మ”గా భావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.కార్యక్రమం కన్నులపండువగా సాగింది. కార్యక్రమ విజయానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్, సంగీత కళాశాల బృందం, పూర్వ విద్యార్థులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: