తక్షణమే ఇరాన్‌ను వీడండి
- భారత్ పౌరులకు కేంద్రం అడ్వైజరీ
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితులు మళ్లీ గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరులకు మన దేశ ఎంబసీ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ‘‘ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. జనవరి 5న భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వైజరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు (విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు) కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్‌ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లండి. భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఇరాన్‌లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని, అలాగే తాజా పరిణామాల కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నాం. భారతీయులంతా పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి సహాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. ఇప్పటివరకు ఎంబసీ వద్ద మీ పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోండి’’ అని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది. ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చలు ఇంతవరకూ కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడికి వెనుకాడబోమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహననౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్‌లను పశ్చిమాసియాలో మోహరించింది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాలతో ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలి దశ అల్లర్లలో 7,105 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం తెలిపింది.



