ఏమిటో మాకు ఇన్ని విజయాలు

ఏమిటో మాకు ఇన్ని విజయాలు

  •  డ్రగ్‌ మాఫియా డాన్‌ హతంపై ట్రంప్

విశ్వంభర, నేషనల్ బ్యూరో: మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌  నెమెసియో ఒసెగుయెరా అలియాస్‌ ‘ఎల్‌ మెంచో’ను హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీపడుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో ఎల్‌ మెంచో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ..‘‘అన్ని విషయాల్లోనూ మేమే గెలుస్తున్నాం. ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు’ అంటూ సోషల్‌ మీడియాలో సరదాగా పోస్ట్‌  చేశారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే డ్రగ్‌ మాఫియా డాన్‌ ‘ఎల్‌ మెంచో’ను మెక్సికో సైన్యం హతమార్చినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌  పేర్కొన్న అనంతరం ట్రంప్‌ ఈ పోస్ట్‌ చేశారు.  అమెరికాకు మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు అమలయ్యేలా ట్రంప్‌ యంత్రాంగం చర్యలు చేపట్టిందని కరోలిన్‌ లీవిట్‌ తెలిపారు. అందులో భాగంగానే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఎల్‌ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో (Mexico) ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్‌ సహకారం అందించిందన్నారు. అయితే అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వస్తున్న వార్తలను వాషింగ్టన్‌లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. డ్రగ్‌ మాఫియా డాన్‌ను బంధించడానికి చేపట్టిన ఆపరేషన్‌ను మెక్సికన్‌ ప్రత్యేక దళాలు ప్లాన్‌ చేసి నిర్వహించాయని తెలిపింది. ఈ విషయంలో అగ్రరాజ్యం కొంత సమాచారం (కాంప్లిమెంటరీ ఇంటెలిజెన్స్) మాత్రమే అందించిందని వెల్లడించింది.

Tags: