పోలీసు శాఖ పై ప్రజల్లో విశ్వాశం పెరగాలి
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుడీజీపీ శివధర్ రెడ్డి
:విశ్వంభర, భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీకి ఎలాంటి భంగం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరూ తమ విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. యూనిఫామ్ ధరించిన ప్రతి పోలీసు అధికారి ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని అదే సమయంలో అవినీతి వంటి దారుణాలకు పాల్పడితే సహించబోమని పేర్కొన్నారు. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు మనసులో అవినీతి ఆలోచనకు కూడా చోటు ఉండకూడదని డీజీపీ స్పష్టం చేశారు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అక్రమ సంపాదనకు అలవాటు పడితే అది వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతను మరచిపోవద్దని విధి మార్గం నుంచి తప్పకూడదని సూచించారు ఇటీవల వరుసగా అవినీతి నిరోధక శాఖ దాడుల్లో కొందరు పోలీసు సిబ్బంది పట్టుబడుతున్న ఘటనలు వెలుగులోకి రావడం పోలీస్ శాఖ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తోందని డీజీపీ అన్నారు. ఈ నేపథ్యంలో శాఖలో క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ప్రతి పోలీసు అధికారి ప్రజలతో స్నేహపూర్వకంగా న్యాయంగా వృత్తి నైపుణ్యంతో వ్యవహరించాలని సూచిస్తూ ఫెయిర్ ఫర్మ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ అనే నాలుగు సూత్రాలను పాటించాలన్నారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా పోలీసు శాఖలో పారదర్శకతను పెంపొందించడానికి పలు చర్యలు చేపడుతున్నామని అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతి కేసును కఠినంగా విచారిస్తామని తెలిపారు. తప్పు చేసిన వారెవరికైనా ఎలాంటి రక్షణ ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసులదేనని గుర్తుచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి పునరుద్ఘాటించారు.



