దళిత ప్రొఫెసర్, విద్యార్థుల పై వేధింపులు మానుకోవాలి 

దళిత ప్రొఫెసర్, విద్యార్థుల పై వేధింపులు మానుకోవాలి 

విశ్వంభర, హైదరాబాద్:  గత కొన్ని వారాలుగా దళిత ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను, దళిత విద్యార్థి కరికే మహేష్ లను అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించి వేధించడాన్ని తక్షణమే ఆపివేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ కె. చక్రధరరావు, ప్రొఫెసర్ జి. హరగోపాల్,  ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణలు డిమాండ్ చేశారు. కొంతమంది విద్యార్థులు కలిసి సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్న ప్రొఫెసర్ సూరే పల్లి సుజాతను, అదేవిధంగా ఎకనామిక్స్ విభాగ విద్యార్థి కరికే మహేష్ లను ఏ ఆధారాలు లేకుండా మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, అర్బన్ నక్సలైట్లని కలెక్టరుకు, పార్లమెంటు సభ్యులకు ఫిర్యాదులు చేస్తూ వివిధ మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అన్ని అర్హతలు అనుభవం ఉన్నప్పటికీ డీన్గా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న దలిత మహిళా ప్రొఫెసర్ ను తొలగించడం కక్షపూరిత చర్య కింద వస్తుంది. ఈ పరిణామాల వలన గ్రామీణ ప్రాంతాల నుండి, దళిత, ఆదివాసీ సమూహాల నుండి వచ్చి చదువుకుంటున్న ఈ యూనివర్సిటీ అకాడమిక్ వాతావరణం కలుషితమై, విశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తి దెబ్బ తింటూ ఉన్నదని వారు అన్నారు. విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి, విద్యా విషయకస్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛలను కాపాడవలసిన వైస్ చాన్స్లర్ మౌనంగా ఉండడం సరికాదన్నారు. విద్యా వ్యాపారీకరణ, అతికేంద్రీకరణ, మత ఉన్మాదం పెరుగుతున్న ఈ కాలంలో అణగారిన వర్గాల నుండి వచ్చిన ప్రొఫెసర్ అందులో మహిళా ప్రొఫెసర్ వేధించడం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ పాలన యంత్రాంగానికి ఉన్నది. ఇప్పటికైనా ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు, వేధింపులు, కక్ష పూరిత చర్యలు మానుకొని యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి, అకాడమిక్ వాతావరణం కాపాడాలని వారు వైస్ ఛాన్స్లర్ ను కోరారు.

Tags: