నల్లగొండ ఇక 'కార్పొరేషన్'
హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి
నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. కార్పొరేషన్ హోదా రావడంతో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హోదాతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పొందే అవకాశం లభించింది. కేవలం 25 నెలల్లోనే నల్లగొండకు ఈ హోదాను సాధించామని మంత్రి గుర్తు చేశారు.
రాజకీయాలకు అతీతంగా నల్లగొండను 'సూపర్ స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులను వెల్లడించారు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు.. రూ.700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు (ORR), ధర్వేశిపురం వరకు 6 లైన్ల రహదారి, బ్రహ్మంగారి గుట్ట – లతీఫ్ సాబ్ దర్గా గుట్టల సమగ్ర అభివృద్ధి చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. సాగునీరులో భాగంగా ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడమే లక్ష్యమని కోమటిరెడ్డి తెలిపారు. ఏఎంఆర్‌పీ (AMRP) కాలువల లైనింగ్ పనుల కోసం రూ.450 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. నల్లగొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వ హయాంలో నల్లగొండ రూపురేఖలు మారిపోతాయని ఆయన స్పష్టం చేశారు.



