కొంగాల ఘటనపై మావోయిస్టు నాయకురాలి లేఖ
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనపై మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరిట సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనపై మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరిట సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. 3వ తేదీన కొంగాల అడవుల్లో కర్రెగుట్టపై వేట్ కోసం వెళ్ళి బూబీట్రాప్ ని తొక్కడంతో అది పేలి జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు మృతిచెందడం, అతడి కొడుకు స్వల్పంగా గాయపడ్డారని, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున సానుభూతి వ్యక్తం చేశారు.
సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ ప్రయోజనాలకు అడవులను కట్టపెట్టడానికి స్థానిక ప్రజలకు అడవులపై ఎలాంటి హక్కులు లేకుండా చేసి ఆదివాసులను అడవుల నుంచి తరిమి వేయాలనే పథకం రూపొందించారని పేర్కొన్నారు. కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై, ప్రజలపై దాడులు చేస్తూ నరసంహారం కొనసాగి ప్రజల్లో భయంకర పరిస్థితులు కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. అందులో భాగంగానే వాజేడు- వెంకటాపురం ఏరియాలో కూడా మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తమ దళాల సమాచారం కోసం కొంతమంది లంపెన్ సెక్షన్‌ను స్వల్ప ఆర్థిక ప్రయోజనాలతో ప్రలోభపెట్టి ఇన్ ఫార్మర్‌గా మార్చుకుంటున్నారని తెలిపారు.
వేటగాళ్ల వేషంలో ఇన్ ఫార్మర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చి అడ్డవుల్లోకి పంపుతున్నారని ఆ సమాచారం ఆదారంగా పోలీసులు నిరంతరం కూంబింగ్‌లు చేపడుతున్నారని పేర్కొన్నారు. తమ సహచర కామ్రేడ్ సహచర కామ్రేడ్స్ సంతోష్ (సాగర్)తో పాటు, మనీరామ్, లక్ష్మణ్‌లు అమరులయ్యారని, ఈ ఘటన తరువాత మరింత కూంబింగ్‌ను పెంచి అడవులను జల్లెడ పడుతూనే ఉన్నారని తెలిపారు. తమ ఆత్మరక్షణకు ప్రజలు నిత్యం పనులు చేసుకునే స్థలాల్లో కాకుండా ప్రజలు తిరగని ఎత్తయిన కొండలపై అనేక ట్రాపులను ఏర్పాటు చేశామని తెలిపారు.
పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీ దళాల సమాచార సేకరణతో పాటు, పోలీసులు కూంబింగ్‌కు వెళ్లేదారులను క్లియర్ చేయడానికి వేట పేరుతో కొద్దిమంది అమాయక ప్రజలను అడవుల్లోకి పంపి తమ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనకు పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు నేడు అభివృద్ధి నిరోధకులు బ్రాహ్మణీయ హిందుత్వవాదులు కొనసాగిస్తున్న క్రూరమైన కగార్ దాడికి వ్యతిరేకంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని, ఈ దాడిని ఓడించడం ప్రజలందరి బాధ్యత కూడా పోరాడమని పిలుపునిచ్చారు.