మంత్రులపై తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్..!
మీడియా కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
రాష్ట్ర రాజకీయాల్లో మీడియా కథనాలు ఇప్పుడు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలపై వెలువడుతున్న కథనాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మీడియా కథనాలు ఇప్పుడు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలపై వెలువడుతున్న కథనాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా మీడియా తీరుపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ''రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. మీ మధ్య ఏవైనా పంచాయితీలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోండి. కానీ, ప్రజాప్రతినిధులపై, మంత్రులపై తప్పుడు వార్తలు రాసి బద్నామ్ చేయాలని చూస్తే సహించేది లేదు. ఆధారాలు లేకుండా కథనాలు అల్లితే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది." అంటూ హెచ్చరించారు.
రాజకీయ దుమారం
రాష్ట్ర కేబినెట్‌లోని కీలక మంత్రులను టార్గెట్ చేస్తూ వస్తున్న వరుస కథనాలు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఒక ఐఏఎస్ అధికారిణికి ముడిపెడుతూ ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం పెను దుమారం రేపింది. దీనిపై మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లక్ష్యంగా బొగ్గు గనుల వ్యవహారంలో అవినీతి జరిగిందనే కోణంలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలను సీఎం పంపినట్లు తెలుస్తోంది.
అది కట్టుకథ: భట్టి
తనపై వస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూర్తిగా కొట్టిపారేశారు. ఒక పత్రిక తనపై రాసిన వార్త కేవలం ఊహాజనితమని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పత్రికా యాజమాన్యంతో ఈ విషయంపై తానే స్వయంగా తేల్చుకుంటానని, చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలోని కీలక నేతలు వరుసగా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



