రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించరా?
విశ్వంభర,అనంతగిరి: నాణ్యత లేని సీసీ రోడ్డు నిర్మాణం పనులు మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో సోమవారం దర్శనం ఇచ్చాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించే సీసీ రోడ్డులో రోబో సాండ్ అధికంగా వినియోగించి తక్కువ శాతం ఇసుకను కలుపుతూ నాణ్యతకు ప్రాధాన్యం లేని విధంగా పనులు చేపట్టారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ గా ఉన్న ఆ గ్రామ సర్పంచ్ సమక్షం లోనే వర్కు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా పనులు జరిపిస్తున్నారు. గ్రామానికి కూత వేటు దూరంలో ఉన్న పాలేరు వాగు నుండి ఇసుకను వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. ఈ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న ఆ సీసీ రోడ్డు ఎంత కాలం ఉంటుందో అని గ్రామస్తులు పెదవిరిస్తున్నారు. ప్రభుత్వ రొక్కంతో ప్రజాశ్రేయస్సుకై చేపట్టే నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు చేసే నిర్లక్ష్యంతో ప్రభుత్వ ధనం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా కొద్ది రోజులకే సీసీ రోడ్డు పాడవుతుంది. ప్రభుత్వ ఆంక్షలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.అదే గ్రామంలో జరిగే నిర్మాణానికి ఇసుక తోలకానికి అనుమతి ఉన్నా కూడా ఎక్కువ శాతం దానిని వాడకపోవడం విడ్డూరం. మండల వ్యాప్తంగా ఇసుక రవాణాకు అడ్డాగా మారిన కొత్తగూడెం గ్రామంలోనే ఇలా ఎక్కువ శాతం డస్ట్ ను వాడడం విశేషం. ఇప్పటికైనా అధికారులు నాణ్యతలో లోపం లేకుండా ప్రభుత్వ నిర్మాణాలు చేసే విధంగా కాంట్రాక్టర్ల పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏఈ వివరణ:
ఇదే విషయంపై సంభందిత అధికారి అయిన ఏఈ ని వివరణ కోరగా ఆయన స్పందిస్తూ సీసీ రోడ్డు నిర్మాణల్లో యాభై శాతం ఇసుకను యాభై శాతం రోబో సాండ్ ను వాడాలని తెలిపారు. ఆ గ్రామంలో జరుగుతున్న పనిపై విచారణ చేస్తాం అని పేర్కొన్నారు.



