ప్రహరీ గోడ పునాదిలో పడి విద్యార్థికి గాయాలు
విశ్వంభర, మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం, పాఠశాలలో ప్రహరి గోడ నిర్మాణం కోసం కొన్ని రోజుల క్రితం పునాది తవ్వి అలాగే వదిలేశారు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో పాఠశాల ఆవరణ ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో పాఠశాలలో చదువుతున్న ఒకటవ తరగతి విద్యార్థి ఆడుకుంటూ పునాది గుంతలో పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, ప్రహరి గోడ నిర్మాణ పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేసి, తవ్విన గుంతలను అలాగే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. కనీస భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన విద్యార్థికి పాఠశాల పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టి, ప్రహరి గోడ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.



