మృతుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల సాయం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మాండ్ర మల్లేష్ అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న విషయం తెలుసుకున్న సిరిపురం జడ్పీహెచ్ఎస్ 1996-1997 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. స్నేహితుడి కుటుంబానికి చేయూతనివ్వాలని నిర్ణయించి సోమవారం లక్ష రూపాయల నగదు సేకరించి మల్లేష్ ఇద్దరు కుమార్తెల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ ఇద్దరు ఆడపిల్లలకు మేమున్నాం అంటూ ముందుకు వచ్చి సహాయం చేయడం ఆదర్శనీయమని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తోటి మిత్రుల సేవలను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస్, సిల్వేరు ఉపేందర్, బెల్లంకొండ నగేష్, సంగిశెట్టి భాస్కర్, కంకల మల్లేష్, సంగిశెట్టి రమేష్, బెల్లంకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



