మునిగలవీడు లో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలి

మునిగలవీడు లో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలి

  • బిజెపి జిల్లా నేత నల్లాని పాపారావు

విశ్వంభర, నెల్లికుదురు: నల్లా నీటి సరఫరా కోసం వేసిన పైపు లైన్లలో లీకేజీల నుంచి చెట్ల వేర్లు చొరబడి పెద్ద కొండచిలువ పామును తలపిస్తున్నాయి. నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మండలంలోని మునిగల వీడులో ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా కోసం రెండు మూడు దశాబ్దాల కిందట వేసిన సిమెంటు ప్లాస్టిక్ పైపులలోకి పక్కనే ఉన్న చెట్ల వేర్లు ప్రవేశించి పైపు ఎంత లావుగా ఉందో అంత లావుగా వేర్ల సమూహం కొన్ని మీటర్ల వరకు వ్యాపించాయి. దీంతో గ్రామంలోని పలు వీధులలోని కుటుంబాలకు నీటి సరఫరా లో తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పలుమార్లు సమస్య ఎదురైనప్పటికీ తాత్కాలికంగా వేర్లను తొలగించి నీటి సరఫరా పునరుద్ధరణ ప్రయత్నం చేస్తున్నప్పటికీ పదేపదే సమస్య పునరావృతం అవుతోంది. ఈ క్రమంలో గ్రామంలోని ఆకారం వెంకటేశ్వర్లు, మారబోయిన శ్రీనివాస్ ల ఇంటి ముందు గల పైప్ లైన్ల లో సోమవారం కొండచిలువ పాము తరహాలో వేర్లు బయటపడ్డాయి. గ్రామంలో రక్షిత మంచినీటి బావి నుంచి నీటి సరఫరాకు ఏర్పడిన అంతరాయం కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తేనే పరిష్కారం అవుతుందని వార్డు సభ్యులు బిజెపి జిల్లా నేత నల్లాని పాపారావు అన్నారు.ఈ మేర కు పొడవుగా ఉన్న వేర్లను చూపుతూ మాట్లాడారు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో రక్షిత మంచి నోటి కోసం వేసిన సిమెంట్, ప్లాస్టిక్ పివిసి పైపుల కాలం చెల్లి పాతవి కావడంతో విపరీతంగా లీకేజీలవుతున్నాయి, దీంతో చెట్ల వేర్లు పైపుల్లోకి వెళ్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పైప్ లైన్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు.

Tags: