జనసేన అభ్యర్థులకు హీరో తనీశ్ మద్దతు
సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన పార్టీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు ప్రముఖ తెలుగు యువ హీరో తనీశ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన పార్టీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు ప్రముఖ తెలుగు యువ హీరో తనీశ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సమాజ శ్రేయస్సు కోరే నిబద్ధత కలిగిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావాలని తనీశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "యువత, మహిళలు, విద్యావంతులు సమాజానికి మంచి చేయాలనే బలమైన ఆకాంక్షతో రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. దీనిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతారు. అందుకే ఆయన పార్టీలో వీరికి పెద్దపీట వేస్తున్నారు." అని అన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. యువత, మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల్లో గెలిచి వ్యవస్థ మార్పులో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థుల ఎంపికలో విద్యావంతులకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా హీరో తనీశ్ మద్దతు తెలపడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.



