ఎర్రవల్లిలో ‘గులాబీ’ వ్యూహరచన
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచడంతో బీఆర్ఎస్ శిబిరంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచడంతో బీఆర్ఎస్ శిబిరంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జారీ చేసిన రెండో నోటీసులపై ఏం చేయాలనే దానిపై ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా శనివారం సుదీర్ఘ చర్చలు జరిగాయి. కేసీఆర్ తన న్యాయ బృందం, పార్టీ ముఖ్యనేతలతో భవిష్యత్ కార్యాచరణపై బేరీజు వేస్తున్నారు. శుక్రవారం నుంచే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లిలోనే ఉండి కేసీఆర్‌తో చర్చిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కీలక నేతలు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బీ-ఫామ్స్ పంపిణీ, రెబల్స్ బుజ్జగింపుల కంటే ఇప్పుడు అధినేత విచారణ అంశమే పార్టీలో ప్రధాన చర్చనీయాంశమైంది.
కేసీఆర్ తన వయసు, ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం తాను ఉంటున్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారణ జరపాలని కోరగా, సిట్ మాత్రం దాన్ని తోసిపుచ్చింది. ఈ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైందని, ఎలక్ట్రానిక్ ఆధారాలు, భారీ రికార్డులను ఎర్రవల్లికి తరలించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో ఎవరూ లేకపోవడంతో సిట్ అధికారులు నోటీసును ఇంటి గోడకు అతికించి రావడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన నివాసం ఎర్రవల్లి అని చెప్పినప్పటికీ, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాజకీయంగా ‘కలిసివస్తుందా’?
మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విచారణ బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారుతుందా లేక సానుభూతిని తెచ్చిపెడుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. 65 ఏళ్లు దాటిన వారిని వారు కోరుకున్న చోటే విచారించాలనే సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం కోర్టులో స్టే కోరాలా? విచారణకు హాజరై అక్రమ కేసులంటూ జనం ముందుకు వెళ్లడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చా? అనే కోణంలో సమాలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటారా? లేక కోర్టు మెట్లు ఎక్కుతారా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.



