చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి
విశ్వంభర, హైదారాబాద్: ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు ప్రతీ ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈరోజు, రేపు రెండు రోజుల పాటు జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు.
చేప ప్రసాదం నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ గౌడ్‌తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంటల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, అలాగే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు పాల్గొంటారని తెలిపారు.
ఈ చేప ప్రసాదం పంపిణీకి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిసా, చత్తీస్ ఘఢ్ తదితర రాష్ట్రాల నుంచి అస్తమా బాధితులు వస్తుంటారు.
ఫిష్ మెడిసిన్ తీసుకునేందుకు గాను ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి ఉబ్బస వ్యాధిగ్రస్తులు రావడం మొదలు కాగా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆర్ అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జల మండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్ నాథ్ గౌడ్, సోదరుడు గౌరీశంకర్ లు పంపిణీ చేయనున్నారు..