పాలనలోనూ మహిళా సర్పంచులు రాణించాలి
ఎమ్మెల్యే డా. మురళి నాయక్
విశ్వంభర, నెల్లికుదురు : మహిళా సర్పంచులుగా గెలుపొందిన మీ గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ప్రజాప్రతినిధులుగా మీ ముద్ర పాలనలో కనిపించాలన్నారు. సతుల స్థానంలో భర్తలు ఆఫీసులకు వస్తే అధికారులు పనులు చేయవద్దని మహిళా సర్పంచులే రావాలని చెప్పాలన్నారు. దీంతో వారికి నాయకత్వ లక్షణాలు,పాలనపై పట్టు లభిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీదేనన్నారు. నెల్లికుదురు మండలంలోని సర్పంచులు,ఉప సర్పంచ్ లకు రైతు వేదికలో సోమవారం స్థానిక సర్పంచి పులి వెంకన్న అధ్యక్షతన ఎమ్మెల్యే సమీక్ష అవగాహన సమావేశం నిర్వహించారు. దీనికి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడెక్కడ నిర్మాణం ప్రారంభించలేదో ఆయా గ్రామ సర్పంచ్ లను, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.ఈ నెలాఖరు వరకు ఇండ్లు ముగ్గు పోయని పక్షంలో ఇందిరమ్మ కమిటీల ద్వారా వేరే వారికి కేటాయించాలని సూచించారు.లేని పక్షంలో సంబంధిత ఇండ్ల డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయన్నారు. సమ్మర్ లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ తయారుచేయాలని సర్పంచ్లకు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మెల్యే సూచించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం నీటి ఎద్దడి ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు నిధులు సమకూర్చనున్నట్లు చెప్పారు. మాజీ సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను క్షేత్రస్థాయిలో ప్రస్తుత సర్పంచులు కార్యదర్శులు పరిశీలించి చెల్లించేందుకు ప్రయత్నం చేయాలన్నారు.కొన్నిచోట్ల గత సర్పంచులు, కార్యదర్శులు కుమ్మక్కై చేసింది కొంతయితే ఎక్కువ మొత్తంలో బిల్లులు కాచేయాలని చూస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని. బయటపడితే ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ చంద నరేష్,ఎంపీడీవో సింగారపు కుమార్,ఎంపీ ఓ పద్మ,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్,సర్పంచులు,ఉప సర్పంచ్ లు,వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



