అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
విశ్వంభర, సిద్దిపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్దెల్లిగారి నాగరాజు తనకున్న మూడెకరాల భూమిలో మూడు బోర్లు వేశాడు. మూడు బోర్లూ పడలేదు. ఉపాధి నిమిత్తం అప్పులు జేసి జేసీబీ కొన్నాడు. జేసీబీ కూడా సరిగ్గా నడవకపోవడంతో అమ్మేశాడు. అప్పుల వల్ల ఏడాది నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కూడా భార్య లావణ్యతో గొడవ జరగడంతో ఆమె పుట్టినిల్లు సీతారాంపల్లికి వెళ్లిపోయింది. అటు అప్పులు, ఇటు భార్య గొడవతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని మృతిచెందాడు. మృతిడికి ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నాడు. భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేశ్ తెలిపారు.
మద్యం తాగిన వ్యక్తికి జైలు శిక్ష
విశ్వంభర, సిద్దిపేట: రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ఎస్ఐ రాజేశ్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా పాళోజీ మురళి అనే వ్యక్తి మద్యం సేవించి బైక్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కాంతారావు 5రోజుల జైలు శిక్ష విధించినట్టు ఎస్ఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.



