యాదవ జేఏసీ సదస్సు ను విజయవంతం చేయాలి
: జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్
విశ్వంభర, బషీర్ బాగ్: దేశంలోనే పెద్ద సామాజిక వర్గాలలో ఒకటైన యాదవ్ సమాజం జనాభాపరంగా, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్నప్పటికీ, రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాలలో అన్యాయానికి గురవుతోందని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం జాఫర్ గూడా గ్రామంలో గ్రామ సర్పంచ్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ రాజకీయ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. యాదవ్‌లలో ఐక్యత లేకపోవడం, సమన్వయం లేకపోవడం వల్లే మనకు రావలసిన హక్కులు ఇతర వర్గాల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ యాదవ్ సమాజం ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఉపయోగించబడుతోంది తప్ప, అగ్రవర్ణ దోపిడీదారుల నాయకత్వంలో నడుస్తున్న పార్టీల రాజకీయ పార్టీలు అధికారంలో సరైన భాగస్వామ్యం యాదవులకు కల్పించడం లేదని వారు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇచ్చి, తరువాత పూర్తిగా మర్చిపోతున్న రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. యాదవ్‌లకు రావలసిన కార్పొరేషన్ నిధులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం, నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, యాదవ్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించకుండా ఆలస్యం చేయడం, ప్రభుత్వ స్థాయిలో సరైన గుర్తింపు లేకపోవడం యాదవ్‌లపై జరుగుతున్న వ్యవస్థాగత అన్యాయానికి ఉదాహరణలని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన బీసీల పితామహుడు బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా ఈ మహాసభ నిర్వహించబడుతుందని తెలిపారు. మండల్ బీసీల హక్కుల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి యాదవ్ నాయకుడు, కార్యకర్త తండోపతండాలుగా హాజరై చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. ఈ సభ యాదవ్ సమాజ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ జెఏసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి యాదవ్, గ్రామ మాజి ఉప సర్పంచ్ జంగయ్య యాదవ్, నియోజకవర్గ నాయకులు కవాడిపల్లి లక్ష్మి నారాయణ యాదవ్ , మెరుగు సుభాష్ యాదవ్ ,రాకేష్ యాదవ్,మల్లేష్ యాదవ్ , లింగ స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



